విక్రమ్ సారాభాయ్

విక్రమ్ సారాభాయ్


భారతీయ అంతరిక్ష ప్రయోగాలు అచిరకాలంలో వేగవంతం కావడానికి అగ్రదేశాలకు దీటుగా ప్రపంచస్ధాయిలో  భారతదేశ ప్రతిష్టను యినుమడింపచేయకానికి  విక్రమ్ సారాభాయ్  అందించిన తోడ్పాటు నిస్సందేహంగా  నిరుపమానమైనది. విక్రమ్ సారాభాయ్  భారతీయ అంతరిక్ష శాస్త్రజ్ఞులలో ప్రథమశ్రేణి  శాస్త్రవేత్తలలో ఒకరు,ఈయన కూడా భారతీయుల దురదృష్టం కొద్దీ  జీవితాన్ని అర్దాంతరంగా  ముగించి వెళ్లిపోయారు. విక్రమ్ సారాభాయ్ పూర్తిపేరు విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. ఈయన  జాతిపిత మహాత్మ గాంధీ బారతాఖండానికి  అందించిన గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ పట్టణంలో సుసంపన్న జైన  కుటుంబంలో ఆగష్టు 12, 1919 సంవత్సరంలో  జన్మించారు. ఈయన తండ్రి విక్రమ్ అంబాలాల్, తల్లి సరళాదేవి. సారాభాయ్ కుటుంబం తరతరాలుగా  వ్యాపారంగంలో గుణితికెక్కినది. ఎన్నో పరిశ్రమలు, వ్యాపారాలను సారాభాయ్ తండ్రి నిర్వర్తించేవారు. అలాంటి ఫక్తు  వ్యాపారధోరణి గల వారసత్వం నుండి దేశం గర్వించదగిన సైన్సు మేధావిగా విక్రమ్ సారాభాయ్ వెలుగులోకి రావడం విశేషమే. విక్రమ్ సారాభాయ్ ఇంటర్మీడియట్ స్థాయి  వరకు అహమ్మదాబాద్ లోనే  చదుకుని సైన్సు పట్ల ఆశక్తిని  ప్రేమను పెంచుకున్నాడు. అక్కడినుండి 1940  సంవత్సరంలో  విద్యాబ్యాసం కోసం మేధావులకు నెలవైన ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి  వెళ్ళాడు. రెండో ప్రపంచయుద్ధం ముంచుకురావడంతో  విక్రమ్ సారాభాయ్  ఇంగ్లాండ్ నుండిభారతదేశం వచ్చేశాడు. బెంగుళూర్ లో ప్రఖ్యాత ఖగోళ, గణిత శాస్త్రవేత్త  సి. వి.  రామన్ నేతృత్యంలో  నడుస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్  సైన్సు లో చేరాడు.  సర్ సి. వి. రామన్  గారి మార్గదర్శకత్వంలో  యువ మేధావి విక్రమ్ సారాభాయ్ కాస్మిక్ కిరణాల మీద విస్తృత  పరిశోధనలు జరిపాడు. రెండో ప్రపంచ యుద్ధం  ముగిసిపోయాక, 1845 లో తిరిగి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రవేశించాడు విక్రమ్ సారాభాయ్. భూమిమీద కాస్మిక్ కిరణాల ప్రభావం అన్న విజ్ఞాన శాస్త్ర పరిశోదన పత్రానికి గాను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం విక్రమ్ సారాభాయ్ కి 1947 లో డాక్టర్ అఫ్ ఫిలాసఫీ అవార్డు ప్రదానం చేసింది. 1947 వ సంవత్సరంలో స్వతంత్ర భారతావనిలో తిరిగి అడుగుపెట్టాడు విక్రమ్ సారాభాయ్. ఆ తర్వాత వెనక్కి  మరలలేదు. భారతదేశానికి తిరిగి వచ్చిన సారాభాయ్  తను ఇంట్లోనే స్వంతఖర్చుతో  1947 నవంబర్ 11వ తేదీన అహమ్మదాబాద్ నగరంలో భౌతిక శాస్త్ర పరిశోధన ప్రయోగశాల కాస్మిక్ కిరణాలూ- అధ్యయనం - ప్రభావం వంటి ఎన్నో విలువైన పరిశోధనలకు వేదిక అయింది ఈ లేబరేటరీ. 

భారతదేశం తాను జరిపే అంతరిక్ష ప్రయోగాలను బలోపేతం, వేగవంతం చేయాల్సివుందని ప్రభుత్వనికి నొక్కి చెప్పాడు విక్రమ్ సారాభాయ్. అందుకోసం ఒక ప్రత్యేక పరిశోధన సంస్థ నెలకొల్పాల్సిన  ఆవశ్యకతను కూడా చూచించాడు. అంతరిక్షంలోకి స్పుత్నిక్  నౌకను పంపి ప్రపంచాన్ని ఆశ్చర్యయచకితుల్ని చేసింది రష్యా. అప్పుడే విక్రమ్ సారాభాయ్ భారతదేశానికి కూడా అంతరిక్ష ప్రయోగాలు చేసే సత్తా ఉందని, ఒకనాటికి భారతీయుడు కూడా చెంద్రుడి మీద కాలు పెట్టె రోజు వస్తుందని గట్టిగా  విశ్వసించాడు. సారాభాయ్ ఆలోచనలతో పూర్తిగా ఏకీభవించారు అప్పటి ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ హామీ జహంగీర్ బాబా. వారిద్దరి కృషి వలనే  ఆంద్రప్రదేశ్ లోని  శ్రీహరికోటలో  నెల్కొల్బబడిన ఇస్రో అనేది మనందరికీ బాగా సుపరిచితమైన అంతరిక్ష ప్రయోగ పరిశోధన కేంద్రం. ఇస్రో కేంద్రం ఇప్పటివరకు ఎన్ని స్పేస్ సాటిలైట్స్ విజయవంతంగా ప్రయోగించింతో- ప్రయోగిస్తోందో మనందరికీ తెలుసు. ఈ విజయాన్ని దశాబ్దాలు ముందే ఉహించి అందుకు తగిన పునాదులు నిర్మించినది మాత్రం విక్రమ్ సారాభాయ్ ! భారతదేశం 1975 వ సంవత్సరంలో తన తొట్టతొలి ఉపగ్రహం ఆర్యబట్ట ను విజయవంతంగా ప్రయోగించగలగడంలో విక్రమ్ సారాభాయ్ కృషి ఎంతో ఉంది.

విక్రమ్ సారాభాయ్ భౌతిక శాస్త్రప్రయోజనాలు  కేవలం అంతరిక్ష ప్రయోగాలకే  పరిమితం చేయలేదు. సామాన్య జనజీవనకి ఆధునిక సాంకేతికత సౌకర్యాలు సమకూర్చడంలో భౌతిక శాస్త్రం నిర్వహించే అద్వితీయమైన పాత్రమీద కూడా ద్రుష్టి సారించాడు. టెలివిజన్ మాధ్యమంగా విద్యాప్రసారాలను దేశమంతటా 2400 గ్రామాల్లో లక్షలాది మంది ప్రజలు వీక్షించగలిగిన ఉపగ్రహం ద్వారా విద్య బోధన 1975- 76 ప్రాంతంలో మనదేశంలో పెనుచలనాన్ని, విప్లవాత్మకమైన  సాంకేతిక అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఇలాంటి సృజనాత్మక ప్రయోగాన్ని అన్నీ తానై ముందుండి నడిపించి వాడు విక్రమ్ సారాభాయ్. విద్యపట్ల విక్రమ్ సారాభాయ్ గల మిక్కిలి మక్కువ కారణంగా భావితరాలను విద్యావంతులను చేయాలనే లక్ష్యంతో అహ్మదాబాద్ నగరంలో 1966 సంవత్సరంలో కమ్యూనిటీ సైన్స్ సెంటర్ ను స్థాపించారు. సారాభాయ్ మరణాంతరం యిదే విక్రమ్ ఎ. సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ గా మార్పు చెంది నేటికీ ఎంతో మందికి సాంకేతిక విద్యాదానం చేస్తోంది. స్వతహా వ్యాపార నేపథ్యం వుంచటం, పుట్టుకతోనే ఆగర్భశ్రీమంతుడు  కావడం వల్ల విక్రమ్ సారాభాయ్ కేవలం అంతరిక్ష పరిశోధన శాస్తజ్ఞునిగా వుంటూనే అనేకానేక విద్యా, వ్యాపార సంస్థల్ని  ప్రజోపయోగార్థం నెలకొల్పాడు.

వాటిలో.

            1.  నెహ్రు ఫౌండేషన్  అఫ్ డెవలప్ మెంట్ (nfd )

           2. ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ అఫ్ మేనేజిమెంట్ (iims )

           3. ఫిసికల్ రీసెర్చ్ లేబొరేటరీ (prl )

           4. అహ్మదాబాద్ టెక్స్ టైల్స్  ఇండ్రస్టీయల్ రీసెర్చ్

              అసోసియేషన్ (atira )

           5.  సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంటల్  పప్లానింగ్  అండ్ టెక్నాలజీ

               (cept )

          6. బ్లైండ్ మెన్ అసోసియేషన్ (bma )

          7. దర్పణ అకాడమి అఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (drpa )

          8. ఫాస్టర్ బ్రీడర్  రియాక్టర్ (fbtr)- కల్పకం

          9. వారియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్  ప్రాజెక్ట్ - కలకత్తా

          10. ఎలక్ట్రానిక్స్  కార్పోరేషన్  అఫ్ ఇండియా లిమిటెడ్ (ecil  )-

                హైదరాబాద్

           11. యురేనియమ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ (ucil )- జరుగూడా , బీహార్ 

 ఇలా విఖ్యాతి చెందిన భౌతిక అంతరిక్ష శాస్త్రవేత్తగానే కాక విద్య వ్యాప్తికి కృషీ చేసిన విద్య పోషకుడిగా, సమాజసేవ పరాయణుడిగా, పారిశ్రామిక శాస్త్రవేత్తగా సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందడానికి బాటలు వేసిన క్రాంతి దర్శకునిగా బహుముఖ పాత్ర పోషించారు విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్ అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు (1962), పద్మభూషణ్ (1966) అవార్డులతో సత్కరించింది. ప్రఖ్యాత నృత్యకళాకారిణి మృణాళినిని పరిణయ మాడిన విక్రమ్ సారాభాయికి ఇద్దరు పిల్లలు. కార్తికేయ, మల్లిక. భారత సాంకేతిక పురోగతికి ఎనలేని కృషి సల్పన విక్రమ్ సారాభాయ్ 1971వ సంవత్సరం డిసెంబర్ 30 వ తేదీన కేరళ రాష్ట్రంలో ని తిరువనంతపురంలో ఉన్నారు. 'తుంబ ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్' పరిసరాల్లో 'తుంబ' రైల్వేస్టేషన్ ప్రారంభానికి శంకుస్థాపన చేయడం  కోసం విక్రమ్ సారాభాయ్ అక్కడకు ఆహ్వానించబడ్డాడు. ఆ క్రమంలోనే ఆ రోజే విక్రమ్ సారాభాయ్ అనంతలోకాలకు తరలి వెళ్లిపోయాడు. అయన చేసిన పరిశోధనలు- వాటి సత్ఫాలాలు, అయన నెలకొల్పిన అనేకానేక విద్యా, వైజ్ఞానిక, వాణిజ్య సంస్థలు దిగ్విజయంగా కొనసాగుతూ  విక్రమ్ సారాభాయ్ జ్ఞాపకాలుగా భారతీయుల మనసుల్లో  నిలిచివున్నాయి.