ధన్వంతరి
సర్వమానవులకూ 'ఆరోగ్యమే మహాభాగ్యం' భారతీయులకు
'ఆయుర్వేదమే మహాభాగ్యం.' ఎందుకంటే ప్రపంచంలో యిప్పుడు అన్ని సంప్రదాయక ఆధునిక వైద్య
విధానాలన్నింటికీ మూలం ఆయుర్వేదం కాబట్టి. మనిషి పుట్టుకకు ముందే ప్రకృతికి ఆయుర్వేదం
వరంగా అందించబడింది. ఎప్పుడో క్షిర సాగర మథనం జరిగినప్పుడే, ఆ పాల సముద్రం నుండి కామ
ధేనువు, కల్ప వృక్షం, ఐరావతలతో బాటు ఆయుర్వేద అధిదేవతయైన ధన్వంతరిగా అవతరించాడు ఆదినారాయణమూర్తి, అందుకే
'వైద్యో నారాయణో హరి' అన్నారు. మానవులను శారీరక రుగ్మతులకు గురి కాకుండా జీవితాంతం
ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆకాంక్షించాడు భగవానుడు. దేహం మానసికంగా, శారీరకంగా సంపూర్ణ
ఆరోగ్యంతో ఉండటం ఎలా? ఒకవేళ శరీరం రోగం బారినపడితే, ఎలాంటి ఇతర దుష్ప్రభావాలు కలగకుండా
తిరిగి ఆరోగ్యం చేకూర్చడం ఎలా? అని పూర్తి వైద్య విధానపు ఆశయానికి బహుచక్కని పరిస్కారం
ఆయుర్వేదం ఇస్తుంది. మన పురాణాల ప్రకారం ఆయుర్వేదానికి మూల పురుషుడు ధన్వంతరి. కాలక్రమేణా ధన్వంతరి పేరుతో ముగ్గురు వైద్య ప్రముఖులు
ఉన్నట్లు చరిత్ర కారులు గుర్తించారు. వీరి జీవితకాలాలు స్పష్టంగా తెలియరాకున్నప్పటికీ
శాస్త్రకారులకు అందిన లెక్కల ప్రకారం 5000 ఏళ్ళ కు ముందే పలు గ్రంథాల్లో ధన్వంతరి ప్రస్థావన
ఉంది. క్రీస్తుపూర్వం 3000 కు ముందే కాశీ రాజైన దికోదాస ధన్వంతరి ఉన్నట్లుగా చరిత్ర
పరిశోధనలకు ఆధారాలు లభించాయి. అయితే ఈయన ఎన్నో ధన్వంతరో వివరం మాత్రం తెలియలేదు. కొందరు
చరిత్ర పరిశోధకుల ప్రకారం ధన్వంతరి విక్రమార్కున నవ రత్నాలుతో ఒకడు. ఈ విక్రమార్కుడు
క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దానికి చెందిన వాడు. ఏది ఏమైనప్పటికి విష్ణుమూర్తిలాగా చతుర్భుజాలతో,
ఒక చేతిలో ఔషధులను, మరొక చేతిలో అమృత భాండాన్ని, మూడు నాలుగు చేతుల్లో శంఖు చక్రాలను ధరించివున్న ధన్వంతరి చిత్రపటాలు ఇప్పటికి
ప్రతి ఆయుర్వేద వైద్యుల ఇళ్ళలో, వైద్యాలయాల్లో, ఆయుర్వేద విశ్వ విద్యాలయాల్లో కనబడుతూ
ఉంటాయి. మానవాళికి శస్త్రచికిత్సను మొదటిగా
పరిచయం చేసింది ధన్వంతరి. ప్రకృతి సిద్ధంగా గాయం కుళ్ళకుండా ఆపే సాధనంగా పసుపును మనిషికి
ప్రసాదించింది ధన్వంతరి! అలాగే నిల్వవుంచే సాధనంగా ఉప్పును, సర్వరోగ నివారిణిగా వేపను పరిచయం
చేశారు ధన్వంతరి . ప్రపంచంలో ప్రప్రథమంగా ప్లాస్టిక్ సర్జరీ ని ధన్వంతరి ప్రయోగించి
నిరూపించారు.
ధన్వంతరి - ఆయుర్వేదం
ఎలాంటి కృత్రిమ రసాయన పదార్దాలను వాడకుండా
సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే ఔషధులను
రోగులకు ఔషధంగా ఇచ్చి పూర్తి వైద్య విధానం ద్వారా స్వస్థత చేకూర్చడం
ధన్వంతరి ప్రవేశ పెట్టిన వైద్య విధానం. ఆయుర్వేదాన్ని సంపూర్ణంగా నిర్వచించి, దానిని ఎలా వాడాలో నిర్దేశించాడు ధన్వంతరి.
ధన్వంతరి - అష్ట విభాగ ఆయుర్వేదం
ఆయుర్వేద వైద్యాన్ని ధన్వంతరి 8 విభాగాలుగా వివరించాడు. అవి.
1) కాయచికిత్స: శరీరానికి చేసే చికిత్సను కాయచికిత్స అంటారు. ఈ చికిత్సలో మనిషి
ఉదర సంబంధ వ్యాధులకు, యింకా కడుపు లోకి తీసుకోవలసిన
ఔషధులు - వాటి పని విధానం సవివరంగా చర్చించబడింది. సాధారణంగా మనిషికి వచ్చే
90% జబ్బులునోటి ద్వారా కడుపులోకి చేరే మందుల
వల్లే తగ్గుతాయి అనేది మన అందరికి తెలిసిందే.
2) బాలచికిత్స : పుట్టిన ముహూర్తం నుంచి
బాల్యదశ వరకు పిల్లలకు వచ్చే సాధారణ రుగ్మతలు, తరుణ వ్యాధులు, వాటి చికిత్స విధానం,
బాలల ఆరోగ్య రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు,
బాలింతలైన స్త్రీలు - ఆహార నియమాలు, శిశు పోషణ రహస్యాలు ఇలా ఒకటనేమిటి? పిల్లలకు సంబందించిన
సర్వరోగ నివారక - ఆరోగ్య ప్రదాయక విశేషాలు ఇందులో చెప్పారు.
3) గ్రహచికిత్స : మనిషి మానసికంగా, ఆరోగ్యంగా దృడంగా ఉన్నపుడే శారీరక వ్యాధుల నుండి త్వరగా కోలుకో గలుగుతున్నాడు. ఈ విధానంలో మానసిక రోగాలక్షణాలు
- చికిత్స విధానాలు , మానసిక ఆరోగ్యానికి పాటించ వలసిన నియమాలు - మానసిక ఉల్లాస విషయం పరిజ్ఞానం చెప్పారు.
ఇవాళ్టి సైకియాట్రిక్ సమస్యలు అన్నిటికీ చక్కని
పరిస్కారాలు గ్రహచికిత్స విధానంలో చెప్పబడ్డాయి.
4) శలాక్యతంత్ర : మనిషి ముఖ్య అవయవాలైన కన్ను,
చెవి, ముక్కు, గొంతు బాధలకు కారణాలు, రోగ లక్షణాలు, చికిత్స విధానాలు, కూలం కషంగా వివరించారు.
అలాగే శరీరంలో సిన్నితమైన అవయవాలు అయినా కన్ను, చెవి, ముక్కు , గొంతు సవ్యంగా ఆరోగ్యంగా ఉండే పరిస్థితులు, పరిసరాల పరిశుభ్రత మొదలైన ఎన్నో ఆరోగ్యదాయక విశేషాలు ఇందులో ఉన్నాయి.
5) శల్యతంత్ర : మందులతో తగ్గని శస్త్ర చికిత్స అవసరపడే చిన్న, పెద్ద
వ్యాధులు, వాటికీ చేయవలసిన లఘు, ఘన శస్త్ర చికిత్స విధానాలు ఈ శల్యతంత్ర విభాగంలో విస్తారంగా
వివరించబడ్డాయి.
6) విషతంత్ర: శరీరంలోకి చెరుపు చేసే విష
పదార్దాలు చేరుకున్నప్పుడు వాటికీ విరుగుడు, విష పదార్దాల వివరాలు, శరీరంలోకి అవి ప్రవేశించినపుడు
మనిషిలో చోటు చేసుకునే రోగ లక్షణాలు, విష పదార్దాలను విరిచే వివిధ రకాల ఔషదాలు - వాటి
ప్రయోగ విదాలు, ఇలా అనేక అంశాలను సవివరంగా విశద పరిచిన ఆయుర్వేద విభాగం విష తంత్రం.
7) రసాయతంత్ర : దీనినే ఆధునిక అల్లోపతి వైద్యులు జీరిమాట్రిక్స్ అంటారు.
అరుదుగా ఆయానా ఒకప్పుడు రోగ చికిత్సకు రసాయనాల ప్రయోగం అత్యావశ్యకం! అయితే ఆ ప్రయోగంలో
రోగి దేహధర్మ వైఖరులు, రోగిలోని సహజ రోగ నిరోధక వ్యవస్థ తీరు తెన్నులు క్షుణ్ణంగా
పరిశీలించ వలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ వివరాలన్నీ ఈ రసాయన తంత్రంలో చర్చించ
బడినాయి.
8) వాజీకరణ తంత్ర: పురుషుడిలో నపుంసక తత్వాన్ని తొలగించి, పుంసత్వాన్ని పెంపొందించి
అద్భుత ఔషధ పరిజ్ఞానం అంతా ఈ వాజీకరణ తంత్ర లో పొందుపరచ బడినది. పురుషుల్లో నపుంసకత్వం,స్త్రీలలో
వంధ్యత్వత ఏర్పడడానికి గల కారణాలు, అందుకు దరి తీసే పరిస్థితులు, శరీరంలో ఏర్పడే లోపాలు,
చికిత్స ఉపయోగపడే ఔషధాలు వివరాలు, చికిత్స చేసే విధానం అన్నీ వివరించబడ్డాయి. ఈ ఎనిమిది
విభాగలు మనిషిలోని సర్వ అవయవాలకు వచ్చే వ్యాధుల గురించి చర్చించాయి. అంటే మనిషిని పరిపూర్ణ ఆరోగ్య వంతునిగా ఉంచ గలిగే సంపూర్ణ వైద్య విధానాన్ని ఆయుర్వేదం ద్వారా
అందించారు ధన్వంతరి. అందుకే ఆయన ఆయుర్వేద స్రష్ట
- అపర నారాయణ స్వరూపుడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి
లేదు.
ధన్వంతరి - ఆలయాలు
భారత దేశం లో అనేక చోట్ల ఆయుర్వేద పితామహుడు
అయినా ధన్వంతరి ఆలయాలు ఉన్నాయి. మఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్ లోని కాశీ విశ్వ విద్యాలయంలో, దేశ రాజధాని ఢిల్లీ, తమిళరాష్ట్రంలో, శ్రీ
రంగం ఆలయంలో ధన్వంతరి విగ్రహాలు ఉన్నాయి. కారణం ఇప్పటికి ఈ ఆధునిక కాలంలో కూడా వేద
కలం నాటి ఆయుర్వేద వైద్య విధాన ప్రక్రియల్ని యథాతథంగా ఎలాంటి మార్పులకు తావు ఇవ్వకుండా
పాటిస్తన్నది, కేరళ ఆయుర్వేద వైద్య శిఖామణులే! అందుకే భారత రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు
సైతం వైద్యం కోసం కేరళ కు వస్తారు. అనితర సాధ్యమైన, సంపూర్ణ ఆరోగ్య ప్రదాయిని అయిన
ఆయుర్వేదాన్ని మానవాళికి అందించిన ధన్వంతరి భారతీయులు అందరికీ, ఆ మాటకొస్తే ప్రపంచ
ప్రజలు అందరికీ ఆరాధ్యనీయుడు.

0 Comments